లాక్‌డౌన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మొదటగా ప్రగతిభవన్ నుండి బయల్దేరి బుద్ధ భవన్‌కు వెళ్తుండగా దారిలో ఆగి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు. కార్మికులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందినవారు. వారు ఉప్పల్ వరకు వెళ్లడానికి మంత్రి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే కనిపించిన బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు తాను అనాథను అని చెప్పగా వెంటనే స్పందించి జీహెచ్‌ఎంసీ నైట్ షెల్టర్‌లో అతడికి బస ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్యను ఆదేశించారు.
బుద్ధ భవన్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్ నగరంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు తీసుకుంటున్న చర్యలపై ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనెజ్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి సందర్శించారు. వివిధ సమస్యలపై కంట్రోల్ రూంకు వస్తున్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపై వచ్చే కాల్స్‌కు మానవతా దృక్పథంతో స్పందించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. అక్కడి నుంచి బయల్దేరిన మంత్రి ప్రక్కనే ఉన్న కాలనీలో పర్యటించారు. కాలనీవాసులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిలో నుండి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ఎర్రగడ్డలో విపత్తు నిర్వహక బృందాలు చేపట్టిన క్రిమిసంహరక స్ప్రే కార్యక్రమాన్ని మంత్రి పర్యవేక్షించారు. మంత్రి పర్యటనలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.