ప్రొటెక్టివ్ సూట్‌లో.. కరోనా ఆస్ప‌త్రికెళ్లిన పుతిన్‌


ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ప్రొటెక్టివ్ సూట్‌తో హాస్ప‌ట‌ల్‌ను విజిట్ చేశారు.  మంగ‌ళ‌వారం ఆయ‌న క‌రోనా పేషెంట్లు చికిత్స పొందుతున్న హాస్ప‌ట‌ల్‌కు వెళ్లారు. అయితే శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పివేసే హ‌జ్‌మ‌ట్ సూట్‌ను వేసుకుని వెళ్లి క‌రోనా వైర‌స్‌కు చికిత్స పొందుతున్న‌వారిని పరామ‌ర్శించారు.  డేర్‌డెవిల్  స్టంట్ల‌కు పేరుగాంచిన పుతిన్‌.. వైర‌స్‌ను లెక్క‌చేయ‌కుండా హాస్ప‌టిల్‌లో రోగుల‌తో మాట్లాడారు.  అయితే రాజ‌ధాని మాస్కోలో ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ట్లు మేయ‌ర్ తెలిపారు. ఇప్ప‌టికే మాస్కోలో 495 కేసులు న‌మోదు అయ్యాయి. కానీ అంత‌క‌న్నా ఎక్కువ కేసులు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు.  


చైనా త‌ర‌హాలోనే ర‌ష్యా కూడా శ‌ర‌వేగంగా క‌రోనా రోగుల కోసం హాస్పిట‌ల్‌ను నిర్మించింది. డాక్ట‌ర్ల‌తో మాట్లాడిన ఆయ‌న వారిని మెచ్చుకున్నారు. క‌రోనా కేసులు పెరుగుతాయ‌ని, దాని ప‌ట్ల ప్ర‌భుత్వం సిద్దంగా ఉండాల‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. హాస్ప‌ట‌ల్‌కు వెళ్ల‌డానికి ముందు పుతిన్‌.. ప్ర‌భుత్వ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. క‌రోనా క‌ట్ట‌డి గురించి వారితో చ‌ర్చించారు. ర‌ష్యాలో ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ట్లు మాస్కో మేయ‌ర్ సెర్గీ తెలిపారు. ర‌ష్యాలో కేవ‌లం ఒక్క ల్యాబ్ మాత్రమే క‌రోనా ప‌రీక్ష‌ల‌కు అందుబాటులో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టెస్టింగ్ సెంట‌ర్ల‌ను పెంచాల‌ని అధికారులు భావిస్తున్నారు.