సిద్దిపేట: కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదని, పారిశుద్ధ్య కార్మికుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆర్థికమంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో మున్సిపల్ కార్మికులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వైద్యులు, పోలీసు ఎంత కష్టపడుతున్నారో.. వారికంటే ఎక్కువగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ. ఐదు వేల అదనపు వేతనం అందిస్తున్నామని చెప్పారు.
కార్మికుడు లేకపోతే.. అభివృద్ధి లేదు: హరీష్ రావు