వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ కివీస్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి.. సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 10ఏండ్ల కెరీర్లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో టేలర్‌కు హ్యాడ్లీ పతకాన్ని ప్రదానం చేశారు. కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్టీఫెన్ ఫ్లేమింగ్ను ఈ సీజన్లోనే రాస్ అధిగమించాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గానూ చరిత్రకెక్కాడు. మొత్తంగా 2019-20 సీజన్లో మూడు ఫార్మాట్లలో టేలర్ మొత్తం 1,389 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. కాగా గతేడాది ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి నిరాశపరిచిందని టేలర్ అన్నాడు. రాస్ టేలర్ అద్భుతమైన ఆటగాడని రిచర్డ్ హ్యాడ్లీ ప్రశంసించారు. కరోనా వైరస్ కారణంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది.
టేలర్‌కు మూడోసారి రిచర్డ్ హ్యాడ్లీ పతకం